- రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు: పేదవాడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలోని మల్కం చెరువు సమీపంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం డ్రాలో ఫ్లాట్లు దక్కిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదవాడికి ఆత్మగౌరవంతో జీవించే చిరునామా ఇవ్వడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు.
హైదరాబాద్‌లో ఎకరం వందల కోట్ల విలువ చేసే ప్రాంతంలో పేద కుటుంబాలకు ఇల్లు ఇస్తున్నామన్నారు. లబ్ధిదారులకు 17 నుంచి 20 గజాల వరకు అన్‌డివైడెడ్ షేర్‌తో పాటు అపార్ట్‌మెంట్‌పై పూర్తి హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. సేల్‌డీడ్‌ను రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా అందించేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యానికి, పైరవీలకు తావులేదని మంత్రి అన్నారు. లాటరీ విధానంలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గంలో తొలి విడతగా 480 ఇండ్ల చొప్పున నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. విడతలవారీగా అర్హులందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ,
హౌసింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ వీపీ గౌతమ్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు రూల్స్ సడలింపు
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ 3 కేటగిరిలోని లబ్దిదారుల ( సొంత ఇళ్లు లేదా సొంత జాగా ఉండి నిర్మాణం స్టార్ట్ చేసిన వారు)ను ఎల్ 1 (సొంత ఇళ్లు సొంత జాగా లేని పేదలు ) కేటగిరిలోకి చేరుస్తూ హౌసింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ర్టవ్యాప్తంగా సుమారు 3250 మంది ఎల్ 3 కేటగిరీలో ఉన్న లబ్దిదారులను ఎల్ 1 కేటగిరిలోకి చేరుస్తూ హౌసింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ వీపీ గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకరించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. పేదల ఇళ్లకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సీఎం ఆదేశాలతో ఈ రూల్స్ ను సవరించామని సోమవారం ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పోర్టల్‌లో ఇప్పటికే మంజూరై బేస్మెంట్ లేదా అంతకంటే పై స్థాయికి చేరుకున్న ఇళ్లకు ఎల్ 3 నుంచి ఎల్ 1 కేసులకు వన్ టైమ్ క్లియరెన్స్ ఇస్తూ నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు.
ఈ ప్రత్యేక సడలింపు ఒక్కసారి మాత్రమే వర్తిస్తుందని, భవిష్యత్తులో ఎల్ 3 మంజూరులో దీనిని ప్రాతిపదికగా పరిగణించమని స్పష్టం చేశారు. దీని వల్ల ఏర్పడే మొత్తం ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అదేవిధంగా ఇల్లు మంజూరైనప్పటికీ నిర్మాణం ప్రారంభం కాని వాటిని రద్దు చేసి అర్హులైన వారికి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇల్లు మంజూరు అయి పనులు ప్రారంభం కానివి మరో 4 వేలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
